విజయవాడ: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు తుది తీర్పు బుధవారం వెలువడనుంది. కేసులో నిందితుడిగా సత్యంబాబును పోలీసులు పట్టుకొని విచారణ చేసిన విషయం తెలిసిందే. రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఆయేషా హత్యకు ఈ రోజు విజయవాడ కోర్టులో తుది తీర్పు రానున్నప్పటికీ ఈ కేసులో సత్యంబాబును నిర్దోషి అంటూ ఇటు బాధితులు, అటు సత్యంబాబు తల్లి అంటున్నారు. కాగా కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకున్నప్పటీకీ సాంకేతిక ఆధారాల కారణంగా విచారణ చేపట్టనున్నారు. అయితే సత్యంబాబే అసలు సాక్షి అనడానికి ఉన్న ప్రత్యక్ష సాక్షి ఆధారం మాత్రం ధనరాజు. ఆయేషా హత్య జరిగిన రోజు ఆమె ఉంటున్న దుర్గ హాస్టల్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ హాస్టల్ వద్దనే సత్యంబాబు తచ్చాడుతున్న విషయాన్ని చూశాడు. ధనరాజు ‘చక్రం’ చిత్రం చూడటానికి వచ్చి సత్యంబాబును చూశాడు. అంతకుమించిన ప్రత్యక్ష ఆధారాలు సత్యంబాబుపైన లేవు. సత్యంబాబు తల్లి కూడా తన కొడుకు అమాయకుడని, పెద్దవాళ్ళను రక్షించటం కోసం పోలీసులు తన కొడుకును బలి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నా కొడుకును రక్షించుకోవడానికి రెండున్నరేళ్లుగా పోరాడుతున్నానని, ఇంకా ఎన్నాళ్లయినా పోరాడుతానని ఆమె అంటున్నారు.
తన కూతురు హత్య కేసులో అనవసరంగా ఓ అమాయకుడిని బలి చేస్తున్నారని, ఈ కేసులో సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని హతురాలు ఆయేషా తల్లి శంషాద్ బేగం అంటున్నారు. ఈ హత్యలో అసలు సూత్రదారులు అయిన కోనేరు రంగారావు బంధువులు, కవిత సౌమ్య కుటుంబం వారిని వదిలి సత్యంబాబును పోలీసులు పట్టుకెళ్లి అనవసరంగా పెద్దవారిని వదిలేస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు మధ్యలో మేము, సత్యంబాబు వంటి మధ్యతరగతి వాళ్లమే బలి అవుతున్నామన్నారు. కాని కేసులో ప్రధాన నిందితులు అయిన పెద్దవాళ్లు మాత్రం తప్పించుకుంటున్నారు. సత్యంబాబును కాకుండా అసలు హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, అయితే వారికి మరణశిక్ష కన్నా మరెవరూ ఆడవారిపై దాడులు చేయటానికి భయపడేలా కాలో, చెయ్యో తీసేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడి కోర్టులో తీర్పు పెద్దవాళ్లకు అనుకూలంగా ఉంటే పై కోర్టుకు అప్పీలు చేసుకుంటామని శంషాద్ అంటున్నారు. అయితే మహిళా సంఘాలు తప్పు ఎవరు చేశారనే దానితో సంబంధం లేకుండా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
0 comments:
Post a Comment